6,609 కంపెనీలు.. 1.24 లక్షల కోట్ల పెట్టుబడులు

indraprabha

టీఎస్‌ఐపాస్ ద్వారా రూ.1.24 లక్షల కోట్లతో 6,609 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. ఇప్పటివరకు రూ.38,203 కోట్ల పెట్టుబడులతో 4,382 కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయని, వీటిద్వారా 1,87,978 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు. మరో 684 యూనిట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. బుధవారం పరిశ్రమలశాఖ కార్యకలాపాలపై సీఎస్ జోషి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్ ట్రేడ్ పాలసీ, ఎలక్ట్రికల్ వెహికిల్ పాలసీలపై త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు సీఎస్ తెలిపారు. ఈ మూడు పాలసీలపై సంబంధిత శాఖల అభిప్రాయాలను తీసుకున్నామని, వెంటనే ముసాయిదా రూపొందించి సమావేశం ఏర్పాటుచేస్తామని అధికారులు సీఎస్‌కు తెలిపారు. అనుమతులు ఇచ్చాక ఆరునెలల్లోగా ప్రారంభం కాని యూనిట్లలో కారణాలపై విశ్లేషణ చేయాలని సూచించారు. పరిశ్రమలకు అనుమతులతోపాటు, వివిధ శాఖలు తమశాఖ పరిధిలో అంశాల అమలుకు నిర్ణీత సమయాన్ని ఖరారుచేయాలని అన్నారు. సులభ వాణిజ్య విధానానికి సంబంధించి 372 సంస్కరణలు ఉండగా 362 ఆమోదం పొందాయని, నాలుగు అంశాలు రాష్ర్టానికి వర్తించనివి ఉండగా, మరో ఆరు వివిధశాఖల్లో పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు వివరించారు. ఈవోడీబీ అమలుకు ఇప్పటివరకు ఒక చట్టాన్ని సవరించామని, 17 జీవోలు విడుదల చేయగా, 42 సర్క్యులర్లు జారీ చేశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీ-ఐడియా పథకం ద్వారా 10,195 యూనిట్లకు రూ.1,658 కోట్లు, ఎస్‌సీపీ ద్వారా 8,994 యూనిట్లకు రూ. 542కోట్లు, టీఎస్పీ ద్వారా రూ7,976 యూనిట్లకు రూ.363 కోట్ల ప్రోత్సాహకాలు అందించినట్టు అధికారులు తెలిపారు. టీఎస్‌ఐఐసీకి సంబంధించి 23 మెగా ప్రాజెక్టులపై సీఎస్ సమీక్షించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, పరిశ్రమలశాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, పరిశ్రమలశాఖ సంయుక్త సంచాలకుడు సురేశ్, జహీరాబాద్ నిమ్జ్ సీఈవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ర్టాలకు ఆర్థిక స్వేచ్ఛ

indraprabha

రాష్ర్టాలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. స్థానికంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు కేంద్రం తన దగ్గర పెట్టుకోవటం అనవసరమని అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పట్టణ, గ్రామీణాభివృద్ధి వంటి శాఖలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలోని గట్టు మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల స్థితిగతుల గురించి కేంద్ర ప్రభుత్వానికి ఏం పట్టి ఉంటుంది? కేంద్రానికి ఏం సంబంధం? అని సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను కూడా కేంద్రం నిర్బంధం చేస్తున్నది. నిధులు ఇవ్వడం లేదు. ప్రోత్సాహం ఉండటం లేదు. కావాల్సిన అనుమతులు ఇవ్వడం లేదు అని సీఎం విమర్శించారు. బుధవారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణం వేరు.. పరిస్థితులు వేరు.. పండే పంటలు వేర్వేరుగా ఉంటాయని అన్నారు. ఇలాంటివాటిపై రాష్ట్రాలకే అధికారాలు ఉండాలని నొక్కిచెప్పారు. వీటికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ శాఖలు రాష్ట్రాలలో కొనసాగుతున్నప్పటికీ అక్కడ పర్యవేక్షించడానికి ఒక్క మనిషి కూడా కనిపించరు అని చెప్పారు. అప్పులు చేయడం తప్పుకాదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. కేంద్రం కూడా భారీగా అప్పులు చేస్తున్నదని గుర్తుచేశారు. అవును తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రమే. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్నది. మంచి వనరులున్నాయి. తెలంగాణ వృద్ధిరేటు 22 శాతంగా నమోదైంది. గత ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ రూ.1.29 లక్షల కోట్లు ఉంది. తెలంగాణ ఏర్పాటైన నాలుగు సంవత్సరాలల్లోనే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ రూ.1.20 లక్షల అయింది. ప్రస్తుతం దేశంలోనే వృద్ధిరేటులో తెలంగాణ ముందున్నది. ప్రస్తుతం దేశంలో జీడీపీలో అప్పులు రూ.82 లక్షల కోట్లు ఉన్నాయి. కేంద్రం ఇప్పటికే రూ.8.30 లక్షల కోట్ల చెల్లింపులు చేస్తున్నది. అంటే అప్పులు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దుబారా చేస్తున్నదా? అప్పులు చేయడం తప్పా? ఇది తెలివైన ఆర్థికవ్యవస్థ. గత 25, 30 ఏండ్ల క్రితం చైనాలో గ్రోత్‌రేటు తక్కువగా ఉండేది. ఇప్పుడు అక్కడ అనూహ్యంగా పెరుగుతున్నది. ఆర్థిక విధానాలలో స్వేచ్ఛ ఎలా ఉండాలి? అనే అలోచన లేదు. దేశ ఆర్థిక విధానంలో 71 సంవత్సరాలుగా దారుణ వైఫల్యం చెందారు అని ఆయన అన్నారు. కష్టపడితేనే కరంటు వచ్చింది రాష్ట్రానికి 24 గంటల కరంటు ఎలా వచ్చింది? ఇదేమైనా తమాషానా? ఎంతో కష్టపడ్డాం. అధికారుల కష్టం ఎంతో దాగి ఉన్నది. మాటలు చెప్తే కాదు. కేంద్రం జీడీపీలో అప్పులు 49.5 శాతంగా ఉన్నాయి. కేంద్రం రూ.82.50 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. కాని తెలంగాణ కేవలం 21% అప్పులు చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారమే అప్పులు చేస్తున్నాం. రాష్ట్రానికి అప్పులు చేసే అవకాశం కూడా ఉన్నది. అంతేకాదు అప్పులను ఎప్పటికప్పుడు చెల్లించడంలో క్రమశిక్షణ పాటిస్తున్నాం. తెలంగాణ ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తున్నది. అవినీతి జరుగడం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఇస్తున్నారు అని సీఎం చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌పై ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుకుందాం. బడ్జెట్‌లో ఏమైనా తేడాలుంటే నిర్మాణాత్మకంగా విమర్శ చేస్తే స్వాగతిస్తాం. పరిపాలన గురించి, అందులో ఉండే ఇబ్బందుల గురించి, దేశ భవిష్యత్తు గురించి చర్చించుకుందాం. ఆర్థికంగా బలంగా ఉన్నందుకు బాండ్లు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. అమెరికా దేశం కూడా అప్పుల్లో ఉంది. అక్కడ 14 ట్రిలియన్ డాలర్ల జీడీపీ ఉంటే..అంతకంటే ఎక్కువ అప్పులున్నాయి. జపాన్ దేశం అప్పులు ఆ దేశ జీడీపీకంటే 250% ఎక్కువగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను కూడా కేంద్రం నిర్బంధం చేస్తున్నది. నిధులు ఇవ్వడం లేదు. ప్రోత్సాహం ఉండటం లేదు. కావాల్సిన అనుమతులు ఇవ్వడం లేదు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల కోసం రూ.24,000 కోట్ల నిధులు అడిగితే రూ.24 కూడా ఇవ్వలేదు. నీతి ఆయోగ్ సూచనల మేరకు రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా కేంద్రం మంజూరు చేయడం లేదు. నిధుల కోసం కేంద్రం చుట్టూ అనేకసార్లు చక్కర్లు కొట్టినా పట్టించుకోవడం లేదు. సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతిపక్షాలు బడ్జెట్‌పై అవగాహన పెంచుకోవాలి. దీనిపై ఉన్నతమైన రీతిలో చర్చ జరుగాలి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల కోసమే అప్పులు చేస్తున్నాం అప్పులు చేయని బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయా? అప్పు చేసి పప్పుకూడు తినడం లేదు. అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాం. ఆస్తులు పెంచుతున్నాం. దుబారా చేయడం లేదు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం రాష్ట్రాల హక్కు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రం నిధులు మంజూరుచేయాలి. అవును క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌పై చర్చ జరుగాలి. అప్పుడే అధికారులు కూడా భయంతో పనిచేస్తారు. మనల్ని మనం విమర్శించుకోవద్దు. దేశంలో ప్రకృతి ప్రసాదించిన నీరు 70 వేల టీఎంసీలు ఉంది. దేశంలో ఉన్న 40 కోట్ల ఎకరాలకు నీరు అందించవచ్చు. అంటే ప్రతి ఎకరానికి నీరు అందించవచ్చు. 14 ఏండ్లుగా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ పనిచేస్తూనే ఉంది. ఇప్పటివరకు నిర్ణయం జరుగకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది? 71 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నదుల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ మంచినీరు, సాగునీరు ఇవ్వలేకపోయారు. ఇప్పటికైనా మేల్కోండి. బుద్ధి తెచ్చుకోండి. నార్త్ చైనాలో 2,140 కిలోమీటర్ల నుంచి 1,600 టీఎంసీల నీరు తీసుకెళ్లి ఇస్తున్నారు. అక్కడ ఎంతో అభివృద్ధి జరుగుతున్నది. ఇక్కడ ఎంత దురదృష్టకరం. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో క్లియరెన్స్‌లను తీసుకువచ్చాం. ఈ ఏడాదిలో జూలై, ఆగస్టు వరకు రాష్ట్రంలో పుష్కలంగా జలం అందుబాటులోకి వస్తుంది అని సీఎం కేసీఆర్ వివరించారు. రైతులు అడుగకున్నా సాయం అందిస్తున్నాం ప్రపంచంలోఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలుపరుస్తున్నాం. రెతులకు పెట్టుబడి సాయం దేశంలో ఎక్కడా అందించడం లేదు. అది తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుస్తున్నాం. ప్రతి ఎకరానికి రూ.8,000 పెట్టుబడి సాయం అందిస్తున్నాం. పెట్టుబడి సాయం కావాలని రైతులు అడుగలేదు. అయినా ప్రభుత్వమే ఇందుకు శ్రీకారం చుట్టింది. రైతులను ఆదుకునే ప్రయత్నం కొనసాగుతుంది అని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా ఆలోచించాలని అన్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతున్నది. ఈ రంగానికి సంబంధించి అనేక ప్రకటనలు వస్తున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో సానుకూల వృద్ధి చోటుచేసుకుంటున్నది అని సీఎం కేసీఆర్ తెలిపారు.

indraprabha

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

టీఆర్‌ఎస్‌లోకి వివిధ పా ర్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం దోండ్లపల్లితో పాటు బోడగుట్ట తండాకు చెందిన 80మంది టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని మంత్రి లకా్ష్మరెడ్డి క్యాంప్ కార్యాలయం లో టీఆర్‌ఎస్‌లో చేరారు. కామారెడ్డి జిల్లా తాడ్వా యి మండల కేంద్రానికి చెందిన సొసైటీ చైర్మన్ దేమాగు సంజీవరెడ్డి బీజేపీ నుంచి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం సికింద్రాపూర్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు 30మంది అ నుచరులతో హైదరాబాద్‌లో మిషన్ భగీరథ వైస్ చై ర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండు వా కప్పుకున్నారు. ఎడపల్లి మండలం అంబం గ్రా మానికి చెందిన పలువురు మహిళలు, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన యువకులు దాదాపు 100మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం బుద్దసముద్రం గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు, గ్రామ పెద్దలు హై దరాబాద్‌లోని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్వగృహంలో టీఆర్‌ఎస్‌లో, రంగారెడ్డి జిల్లా మాడ్గుల మం డలం ఫిరోజ్‌నగర్‌కు చెందిన 50 మంది గిరిజనులు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి స మక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో గ్రామీణ నీటి సరఫరాలో సీపీడబ్ల్యుఎస్ పథకాల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల నాయకులు టీఆర్‌ఎస్ కార్మిక విభాగంలో చేరగా, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌కేవీలోకి ఆహ్వానించారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని విప్ అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్రకార్యదర్శి గట్టు రాంచందర్ రావు, నాయకులు నారాయణ, గుర్రం వెంకట్ రెడ్డి, శారద, మారుతిరావు, సురేందర్, బిష్మందర్ పాల్గొన్నారు.


మరో వెయ్యి డబుల్ ఇండ్లు

indraprabha

డబుల్ బెడ్‌రూం పథకంలో మూడో దశకు ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిందని, ఇందులో భాగంగా కరీంనగర్‌కు మరో వెయ్యి ఇండ్లు రానున్నాయని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఇప్పటికే మొదటి దశలో 400 ఇండ్లు, రెండో దశలో వెయ్యి ఇండ్లు మొత్తంగా 1400 ఇండ్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఆరు నెలల్లోనే ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసి, సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు. పద్మనగర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశిస్తూ, పలు సూచనలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టారనీ, అర్హులందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. మొదటి, రెండు దశల్లో మంజూరైన 1400 ఇండ్లలో నగరానికి 560, గ్రామీణులకు 840 ఇండ్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో 20 నుంచి 30 ఇండ్లను అర్హులకు మంజూరు చేస్తామన్నారు. మూడో దశలో నగరానికి 400, గ్రామాలకు 600 ఇండ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది 2500 ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పద్మనగర్‌లో జీ+5 ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయనీ, ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిని నిరుపేదలకు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఇండ్లతోపాటు షాదీఖానా, అంబేద్కర్ కమ్యూనిటీ భవనాలకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఇండ్ల నిర్మాణానలు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, భూమి అందుబాటులో లేకపోవడంతోనే ఆలస్యమైందని తెలిపారు. అయితే పనుల్లో వేగం పెంచి, సకాలంలో నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. డెయిరీకి చెందిన భూముల్లో డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టేలా తాను సీఎంతో ప్రత్యేకంగా మాట్లాడి, అనుమతి పొందినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాసాల రమేశ్, కార్పొరేటర్లు డీ రవీందర్, బోనాల శ్రీకాంత్, ఏవీ రమణ, కంసాల శ్రీనివాస్, ఈఈ రాఘవచార్యులు, డీఈ నర్సింహాచార్యులు, నాయకులు ఎడ్ల అశోక్, కర్ర సూర్యశేఖర్, స్థానిక నాయకులు, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు 1,450 కోట్లు

indraprabha

ఆడ పిల్లల వివాహాలు చేయలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పేద తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. 2018-19 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 1,450 కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. బాల్య వివాహాలు నిరోధించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మొదట ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు వర్తింపచేసిన ఈ పథకాన్ని, ఆ తర్వాత బీసీలు, అగ్ర వర్ణాలలో ఉన్న పేదలకు కూడా వర్తింపజేశామన్నారు. ఇప్పటి దాకా కల్యాణలక్ష్మి పథకం కింద 2,12,126 మంది, షాదీముబారక్ కింద 78,003 మంది ప్రయోజనం పొందినట్లు ఈటల వెల్లడించారు.